India wins Asia Cup ఆసియా కప్ విజేత భారత్; ట్రోఫీని తిరస్కరించడం సంచలనం
ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తీవ్ర ఒత్తిడిలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 69 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను 146 పరుగులకే కట్టడి చేశాడు. ఈ విజయంతో భారత్‌కు రూ.21 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
అయితే, మ్యాచ్ తర్వాత భారత జట్టు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని, మెడల్స్‌ను తీసుకోవడానికి ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో విజేత ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు.
ఈ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, ఒక విజేత జట్టు ట్రోఫీని తిరస్కరించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చని పేర్కొన్నాడు. తమ అసలైన ట్రోఫీలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సహచర ఆటగాళ్లే అని ఆయన తెలిపారు. అంతేకాక, ఆసియా కప్‌లో తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీకి విరాళంగా ఇస్తానని సూర్యకుమార్ ప్రకటించాడు. ఈ విజయంపై స్పందించిన ప్రధాని మోదీ, “యుద్ధభూమిలోనూ.. మైదానంలోనూ ఒకటే ఫలితం” అని పోస్ట్ చేశారు. బీసీసీఐ కార్యదర్శి నఖ్వీ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.








